అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) నెం.1ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. పబ్లిక్ రోడ్లపై రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌షోలను పరిమితం చేయడానికి ఈ ఏడాది జనవరి 2వ తేదీన సీఎం జగన్ సర్కార్ జీవో నెంబర్ 1ని ప్రవేశపెట్టింది. అయితే జీవోను సవాలు చేస్తూ వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సమయంలో పిటిషనర్లు విపక్షాల గొంతును అణిచివేసే ఉద్దేశ్యంతో జీఓ జారీ చేయడం పోలీసు చట్టంలోని సెక్షన్ 30కి విరుద్ధంగా ఉందని వాదించారు.
రోడ్లపై బహిరంగ సభలను నిషేధించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు, ఇతర రాజకీయ సంఘాల నోరు మూయించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే జీవోను సవాల్ చేస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్ నేత గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సహా ఇతర రాజకీయ నేతలు కూడా పిటిషన్లు సమర్పించారు.
అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపై బహిరంగ సభలకు అనుమతి నిరాకరించవచ్చని, అనుమతించవచ్చని జిఓ పేర్కొంది. అయితే, రోడ్లపై కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు జిఓ నెం.1ని ఉపయోగించుకుంటాయనే ఆందోళన నెలకొంది. ఈ పిటిషన్లను జనవరి 24న హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును ఈ రోజు ప్రకటించింది. జీఓ నెం.1 ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని హైకోర్టు ప్రకటించింది.