ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఎస్ఈసి ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని, మంత్రిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడం రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసి ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ కు సంబంధించిన ఆదేశాలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఎన్నికల అంశాలకు సంబంధించి విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని మంత్రిని హైకోర్టు ఆదేశించింది.
ఇదిలావుంటే.. మంత్రులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, బయటకు రాకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రిని మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలన్నారు. తాజాగా ఎస్ఈసి ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.