మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట
మోహన్‌బాబు యూనివర్సిటీకి హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో ఎంబీ యూనివర్సిటీ రద్దు, రూ.26.17 కోట్ల అదనపు ఫీజు రీఫండ్ కోసం ..
By - అంజి |
మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట
అమరావతి: మోహన్‌బాబు యూనివర్సిటీకి హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో ఎంబీ యూనివర్సిటీ రద్దు, రూ.26.17 కోట్ల అదనపు ఫీజు రీఫండ్ కోసం ఇటీవల ఏపీఎస్‌సీహెచ్‌ఈ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్ద చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది. ఈ క్రమంలో దీనిపై వర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. అడ్మిన్ బాధ్యతలను ఎస్‌వీయూకి అప్పగించాలన్న ఉత్తర్వునూ నిలిపివేసింది. ఆదేశాలు ఇచ్చినా సిఫార్సులను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడంపై ఏపీఎస్‌సీహెచ్‌ఈని కోర్టు ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ప్రధాన వ్యాజ్యంపై విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
తిరుపతి జిల్లా రంగంపేటలోని తమ యూనివర్సిటీ గుర్తింపు రద్దుతో పాటు ఇతర చర్యలను రద్దు చేయాలని కోరుతూ గతంలో మోహన్‌బాబు వర్సిటీ రిజిస్ట్రార్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కమిషన్ ఉత్తర్వులలోని పలు భాగాలపై స్టే విధిస్తూ సెప్టెంబరు 26న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని, ఎంబీయూ గుర్తింపు రద్దు చేయాలని, పరిపాలన బాధ్యతలు ఎస్‌వీయూకు అప్పగించాలని చేసిన సిఫారసుల అమలును నిలుపుదల చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ తర్వాత కూడా ఆ ప్రొసీడింగ్స్‌ను ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంబీయూ అనుబంధ పిటిషన్ వేసింది.
ఇది గురువారం విచారణకు రాగా యూనివర్సిటీ తరఫున న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల అనంతరం కూడా ఆ ప్రొసీడింగ్స్‌ను ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిందన్నారు. ఈ విషయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయని చెప్పారు. కమిషన్ చర్యలతో యూనివర్సిటీ పరపతి దెబ్బతిందన్నారు. ప్రొసీడింగ్స్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించాలన్న తమ అభ్యర్థనను కమిషన్ పట్టించుకోలేదన్నారు.