మడావి హిడ్మా హతం.. రూ.6 కోట్ల రివార్డ్.. 17 ఏళ్ల వయసులోనే దళంలోకి.. 26 దాడుల్లో కీలక పాత్ర
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావెయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు.
By - అంజి |
మడావి హిడ్మా హతం.. రూ.6 కోట్ల రివార్డ్.. 17 ఏళ్ల వయసులోనే దళంలోకి.. 26 దాడుల్లో కీలక పాత్ర
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావెయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన హిడ్మా గురించి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా.. మావోలు నడిపే స్కూల్లో చదివి, 1996 -97 మధ్య 17 ఏళ్ల వయసులోనే దళంలోకి వెళ్లాడు.
ఏడో తరగతి వరకే చదివినా.. ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లలో దిట్ట. అంచెలంచెలుగా ఎదిగి.. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా మారాడు. దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టుల్లో చేరిన హిడ్మా పెద్దగా తుపాకీ పట్టలేదు. కానీ క్యాడర్‌కు ఎప్పుడు? ఎక్కడ? ఎలా? దాడి చేయాలనే వ్యూహాలు, సూచనలిస్తాడు. మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ప్రాతినిధ్యం వహించాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి.
మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన 26 పెద్ద దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిన హిడ్మా.. కేంద్ర బలగాలపై మెరుపు దాడుల్లో ఎప్పుడూ ముందుండేవాడు.
పీఎల్‌జీఏ 1వ బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తూ, కేంద్ర కమిటీలో చిన్న వయస్కుడిగా ఎదిగాడు. పలు దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. 2010 దంతెవాడ దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి, 2013లో జిరామ్ ఘాట్‌లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి, 2021లో సుక్మా బీజాపూర్‌లో 22 మంది భద్రతా సిబ్బంది మృతిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. అతడిపై కేంద్రం రూ.45 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వాలది కలిపి ఇది రూ.6 కోట్ల రివార్డ్ ఉంది. కాగా ఇవాళ అల్లూరి జిల్లాలో హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే.