ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన లంక గ్రామాలు

Heavy rains in AP.. several Lanka villages submerged. భారీ వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాల్లోని 130కి పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

By అంజి  Published on  13 July 2022 1:44 PM IST
ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన లంక గ్రామాలు

భారీ వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాల్లోని 130కి పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరదల కారణంగా కమ్యూనికేషన్ లైన్లన్నీ తెగిపోవడంతో చాలా మందికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

గోదావరికి వరద పోటెత్తుతోంది. బుధవారం ఉదయం ధవలేశ్వరం బ్యారేజీ నుంచి ముందు జాగ్రత్తగా అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో వరద నీటి ప్రవాహంతో కొన్ని మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూన లంక, బడుగువాని లంక, జి పెదపూడి లంక, అరికావల్ పేట, బూరుగు లంక, అయోద్యపేట, పెద్ద వల్ల లంక, తోక లంకలకు వరదలు వచ్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది గోదావరికి నెల రోజుల ముందే వరదలు వచ్చాయి. ప్రతి సంవత్సరం వర్షాలకు ముందు లంక గ్రామాల నివాసితులు వరద పరిస్థితిలో అవసరమైన అన్ని అవసరమైన వస్తువులను నిల్వ చేసుకుంటారు. నీటి మట్టం తగ్గే వరకు వారు సాధారణంగా తమ ఇళ్ల నుండి బయటకు రారు.

నాటు పడవల్లో ప్రయాణం

గోదావరికి ప్రధాన ఉపనదుల్లో ఒకటైన శబరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రోడ్లన్నీ నీట మునిగాయి. నిత్యావసరాల కోసం స్థానికులు పడవలను ఉపయోగిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం వరద నీటిలోనే నడవాల్సి వస్తోంది. 6000 మందికి పైగా జనాభా ఉన్న 130 గ్రామాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. చాలా ప్రాంతాలకు ఇదే పరిస్థితి ఉంది.. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వంతెన నిర్మించాలి.. గోదావరి నుంచి నీటిని విడుదల చేసిన ప్రతిసారీ ప్రమాదాల బారిన పడుతున్నామని.. పంటలు దెబ్బతిన్నాయని పెదపూడి లంకకు చెందిన స్థానికుడు తెలిపారు.

Next Story