రెయిన్ అలర్ట్..రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పిడుగులతో కూడిన వానలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.
By Knakam Karthik
రెయిన్ అలర్ట్..రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పిడుగులతో కూడిన వానలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు చెప్పారు. దీనిపైగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 18004250101కు డయల్ చేయాలని సూచించారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదు అని సూచించారు.
నేడు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. కర్నూలు, వైఎస్‌ఆర్, తిరుపతి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.