అల‌ర్ట్‌.. ఏపీలో 4 రోజుల పాటు దంచికొట్ట‌నున్న ఎండ‌లు

Heat wave forecast in AP for 4 days.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2022 3:35 AM GMT
అల‌ర్ట్‌.. ఏపీలో 4 రోజుల పాటు దంచికొట్ట‌నున్న ఎండ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడ‌తాయ‌ని చెప్పింది. నేటి నుంచి (ఏప్రిల్ 23) నుంచి 26 వ‌ర‌కు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతాయ‌ని ఐఎండీ తెలిపింది. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి బ‌య‌ల‌కు రావోద్ద‌ని హెచ్చ‌రించింది. వృద్ధులు, మహిళలు, గర్భవతులు ఇళ్లకే పరిమితం కావాలని, ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.

ఏప్రిల్ 23 శ‌నివారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు, పశ్చిమగోదావరి, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వివరించింది.

ఏప్రిల్‌ 24 ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల‌ వరకు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

ఏప్రిల్ 25 సోమ‌వారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల‌ వరకు, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు న‌మోదు కానున్నాయి.

ఏప్రిల్ 26 మంగ‌ళ‌వారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల‌ వరకు విశాఖపట్నం, అనకాపల్లి , కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచించింది.

Next Story