కోడిగుడ్లు దొంగిలించిన ప్రధానోపాధ్యాయురాలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వృద్ధురాలు

Headmistress who stole chicken eggs in Nellore govt school. నెల్లూరు జిల్లా గుడిపల్లి పాడు అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కోడిగుడ్లను

By అంజి  Published on  27 Jan 2023 10:13 AM IST
కోడిగుడ్లు దొంగిలించిన ప్రధానోపాధ్యాయురాలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వృద్ధురాలు

నెల్లూరు జిల్లా గుడిపల్లి పాడు అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కోడిగుడ్లను దొంగతనం చేసింది. పౌష్టికాహార కింద చిన్నారులకు అందించే కోడి గుడ్లను దొంగిలించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని స్థానిక వృద్ధురాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. గుడిపల్లి పాడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గుడ్లు (కోడి గుడ్లు) దొంగిలించి తన బ్యాగులో వేసుకుని వెళ్తుండగా స్థానిక వృద్ధురాలు.. ఆమెను ఆపింది. పిల్లలకు ఇచ్చే గుడ్లు ఎందుకు తీసుకెళ్తున్నావని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయురాలు వృద్ధురాలపై దురుసుగా ప్రవర్తించింది.

అయినా వృద్ధురాలు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. గుడ్లు చోరీకి గురైన హెచ్‌ఎం బ్యాగ్‌ని తనిఖీ చేయగా గుడ్లు దొరికాయి. దీంతో కోపోద్రిక్తురాలైన ఉపాధ్యాయురాలు వృద్ధురాలుపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దొంగతనం చేసిన ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన పిటిషన్ ఆధారంగా పోలీసులు వృద్ధురాలుపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. కోడి గుడ్ల దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. కోడి గుడ్లు దొంగిలించిన ఉపాధ్యాయురాలిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

మరోవైపు ఈ విషయంలో పోలీసులు వృద్ధురాలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీశారు. రూ.లక్ష రూపాయల జీతం తీసుకునే ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు పెట్టాల్సిన కోడి గుడ్లను తీసుకుపోతూ అడ్డంగా దొరికితే, ఆమెపై కేసు పెట్టకుండా పట్టించిన వారిపై కేసు పెట్టడం ఏంటని సోమిరెడ్డి ప్రశ్నించారు. కోడిగుడ్ల దొంగతనం విషయమై గ్రామస్థులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. ప్రధానోపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Next Story