కాపు డిక్లరేషన్ కూడా ప్రకటించాలి.. పవన్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ
పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు.
By Srikanth Gundamalla
కాపు డిక్లరేషన్ కూడా ప్రకటించాలి.. పవన్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. బీసీ డిక్లరేషన్ మాదిరిగానే కాపు డిక్లరేషన్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే.. తాము బీసీ డిక్లరేషన్‌కు వ్యతిరేకం కాదన్నారు. జయహో బీసీ అంటూ 10 హామీలతో మంగళగిరిలో పవన్, చంద్రబాబు ప్రకటించిన డిక్లరేషన్‌ను తాను ఆహ్వానిస్తున్నట్లు హరిరామ జోగయ్య చెప్పారు.
జనాభాలో 25 శాతం ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగలకు కూడా డిక్లరేషన్ ప్రకటించి వారి అభివృద్దికి సహకరించాలని హరిరామ జోగయ్య కోరారు. బీసీలకు పంచాయతీరాజ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్స్ కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆయన కొనియాడారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 34 శాతం రిజర్వేషన్‌ను 24 శాతానికి కుదించడంతో బీసీల విరోధిగా ముద్రపడిన వాస్తవమన్నారు. 52 శాతం ఉన్న ఆర్థికంగాను , విద్యాపరంగాను , సామాజికపరంగాను వెనుకబడియున్న బీసీ కులాలకు ఆర్ధిక , విద్యాపరంగా , సామాజికపరంగా లబ్ధి చేకూర్చగల ఈ 11 హామీలు హర్షించదగినవి అని లేఖలో హరిరామ జోగయ్య చెప్పుకొచ్చారు.
కాపులకు కూడా బీసీలతో సమానంగా సంక్షేమం దక్కాలని హరిరామ జోగయ్య అన్నారు. కాపు కులస్తులు కూడా యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాల్సిందే అని హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్‌కు సూచించారు. న్యాయపరంగా కూడా దీనిని కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గానికి కూడా అన్ని సౌకర్యాలను ప్రకటిస్తూ ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని అంశాలతో కూడిన హామీలను పొందుపర్చాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో ఈ కులాల నుంచి పూర్తి సహకారాన్ని పొందవచ్చని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు.