ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో రేపటి నుంచి విద్యార్థులు స్కూళ్లకు పరుగులు పెట్టనున్నారు. అయితే వేసవి సెలవులు ముగిసినా.. ఎండ వేడిమి తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధిక మొత్తంలో నమోదవుతుండటం, వేడిగాలులు వీస్తుండటంతో ఒంటి పూడ బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఈ క్రమంలోనే పాఠశాలల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ప్రభుత్వం మాత్రం పాఠశాలల పునఃప్రారంభానికి మొగ్గు చూపింది. జూన్ 19వ తేదీ నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం.. పాఠశాలలు పూర్తి స్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయనున్నారు. తిరిగి ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద ఇవ్వనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.