వచ్చే ఏడాది హజ్‌యాత్రకు వెళ్లేవారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. యాత్రకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ అజమ్ సూచించారు. ఈ సారి 2,930 మందికి అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 900 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని, అవసరమైతే గడువు పొడిగించాలని సీఎం జగన్‌ను కోరుతామని చెప్పారు. విజయవాడలోని హజ్ కమిటీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మెడికల్ సర్టిఫికెట్ల సమర్పణకు గడువు ఉందన్న ఆయన.. జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు విమానాలు నడుస్తాయని చెప్పారు. పోయినసారి ప్రభుత్వం హజ్‌యాత్ర కోసం రూ.14.51 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. కిందటిసారి కేంద్ర కమిటీ వద్దకు ప్రతినిధి బృందం వెళ్లిందని ఈసారి కూడా వెళుతుందని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న హజ్ యాత్రికులను గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి పంపించాలన్నారు. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ.60 వేలు, అంతకుమించి ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.30 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వసతి సౌకర్యాలు కల్పిస్తామని షేక్ గౌసల్ తెలిపారు.