'రాజకీయాలను వదిలేస్తున్నా'.. ఎందుకో చెప్పిన గల్లా జయదేవ్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
By అంజి Published on 28 Jan 2024 12:15 PM IST'రాజకీయాలను వదిలేస్తున్నా'.. ఎందుకో చెప్పిన గల్లా జయదేవ్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్ల పాటు తన వంతు కార్యక్రమాలు నిర్వహించానని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. గుంటూరులో కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నానని అన్నారు. పూర్తిగా వ్యాపారంపై దృష్టిసారిస్తానని తెలిపారు. రాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగొచ్చారని, తాను కూడా అలాగే తిరిగొస్తానన్నారు. అవకాశం దొరికితే మళ్లీ పోటీ చేస్తానని జయదేవ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని, అందుకే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాని తెలిపారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనని, తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందని అన్నారు. రెండేళ్ల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతోంది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నానని గల్లా జయదేవ్ అన్నారు. రాజకీయాల్లో తాను స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. పార్లమెంట్‌లోరాష్ట్ర సమస్యలు, ప్రత్యేకహోదా కోసం పోరాడనన్నారు. రాజధానిగా అమరావతికే మద్దతు ఇస్తా అని తెలిపారు.