జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. గుంటూరు జిల్లా జ‌వాను వీర‌మ‌ర‌ణం

Guntur jawan martyred while fighting terrorists.జ‌మ్ముక‌శ్మీర్ రాజోరి జిల్లాలోని సుంద‌ర్‌బాని సెక్టార్‌లో ఉగ్ర‌వాదుల‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2021 9:53 AM IST
జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. గుంటూరు జిల్లా జ‌వాను వీర‌మ‌ర‌ణం

జ‌మ్ముక‌శ్మీర్ రాజోరి జిల్లాలోని సుంద‌ర్‌బాని సెక్టార్‌లో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా బాప‌ట్ల‌కు చెందిన యువ జ‌వాను మ‌నుప్రోలు జ‌శ్వంత్ రెడ్డి(23) వీర మ‌ర‌ణం పొందాడు. సుందర్‌బని సెక్టార్‌లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. వారిలో జశ్వంత్ రెడ్డి కూడా ఉన్నారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 23 ఏండ్ల జశ్వంత్‌ రెడ్డి ఐదేండ్ల క్రితం 2016లో మ‌ద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరారు. తొలుత నీల‌గిరిలో ప‌నిచేసిన ఈయ‌న ప్ర‌స్తుతం జ‌మ్ముక‌శ్మీర్‌లో విధులు నిర్వ‌హిస్తున్నారు. నాలుగు నెల‌ల క్రితం సెల‌వుల‌కు ఇంటికి వ‌చ్చి వెళ్లారు. మ‌రో నెల‌రోజుల్లో అత‌నికి వివాహం చేసేందుకు కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతో ఈ ఘోరం జ‌రిగింది. ఈరోజు రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది. జశ్వంత్‌ రెడ్డి మరణంతో దరివాద కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story