Guntur: అన్నపర్రు బాయ్‌ హాస్ట్‌లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాయ్స్‌ హాస్టల్‌లో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

By -  అంజి
Published on : 10 Oct 2025 5:01 PM IST

Guntur District, 47 Students Fall Ill, Annaparru Hostel, APnews

అన్నపర్రు బాయ్‌ హాస్ట్‌లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాయ్స్‌ హాస్టల్‌లో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరోచనాలు, వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే విద్యార్థులను దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

హాస్టల్‌లో మొత్తం 106 మంది విద్యార్థులు ఉండగా.. 47 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్‌ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే బూర్ల ఆంజనేయులు, గుంటూరు కలెక్టర్‌ హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హాస్టల్‌కు వార్డెన్‌ రావడం లేదని ఫిర్యాదులు అందాయని, వార్డెన్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానని చెప్పారు.

అన్నపర్రు హాస్టల్‌లో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశామని, విద్యార్థులకు మెడికల్‌ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. మెడికల్‌ క్యాంప్‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి, తహసీల్దార్ హేనా ప్రియ పర్యవేక్షిస్తున్నారు. కాకుమాను, పాండ్రపాడులోని మెడికల్ సిబ్బందిని పిలిపించి పిల్లలకు వైద్యం చేయిస్తున్నారు. అటు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story