కోనసీమలో కలకలం.. ఫైనాన్షియర్‌పై దుండగుల కాల్పులు

Gun shot at financier.. Incident in Konaseema district. డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లా పరిధిలోని రావులపాలెంలో ఇద్దరు గుర్తు తెలియని

By అంజి  Published on  5 Sept 2022 11:48 AM IST
కోనసీమలో కలకలం.. ఫైనాన్షియర్‌పై దుండగుల కాల్పులు

డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లా పరిధిలోని రావులపాలెంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫైనాన్షియర్‌ను తుపాకీతో అంతమొందించేందుకు ప్రయత్నించారు. అయితే ఫైనాన్షియర్‌ ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించాడు. దీంతో ఓ దుండగుడు తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా ఆదిత్యరెడ్డి చేయి పట్టుకుని అడ్డుకున్నాడు. ఇంతలో గాలిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అదే సమయంలో తుపాకీలో ఉన్న మ్యాగజైన్ గన్ నుంచి వేరుపడి నేలపై పడింది. గన్‌ పేలిన శబ్దానికి.. ఘటనా స్థలంలో జనాలు గుమిగూడారు.

దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఒక బ్యాగ్‌ను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫైనాన్షియర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

రావులపాలెం ఇన్‌ఛార్జ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఆదిత్యరెడ్డి చేతికి, తలకు గాయాలయ్యాయని, బ్యాగ్‌లో రెండు బాంబులు ఉన్నాయని తెలిపారు. బుల్లెట్‌, బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దాడికి ఆర్థిక వివాదాలే కారణమని చెప్పారు. అయితే ఘటనకు సంబంధించి ఫైనాన్షియర్ గుట్టు విప్పకపోవడంతో మిస్టరీగా ఉంది..దుండగులు ఏవరో తెలియదని ఫైనాన్షియర్ చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాల్పులపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story