ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్ -2 ఉద్యోగాలకు ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. 4,83,525 మంది అభ్యర్థుల కోసం 1,327 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడీ తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావొద్దని అధికారులు స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు కూడా తెరవకూడదని ఆదేశాలు ఇచ్చారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
10.15 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఆతర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు నిరంతర పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు. అదే విధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8500 ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3971 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్షలు జరిగే తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించారు.