అమరావతి: క్రైస్తవ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2024 - 2025 సంవత్సరానికి గానూ 4.86 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇందులో రూ.2.43 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా అందించనుందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.4.86 కోట్ల స్వయం ఉపాధి ప్రణాళిక అమలుకు నిర్ణయించామన్నారు. ఇందులో రూ.2.43 కోట్లు ప్రభుత్వం రాయితీ కింద ఇస్తుండగా, మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ రూపంలో పంపిణీ చేయనున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి ఫరూక్ తెలిపారు.