నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం.. 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు
Grand welcome for TDP's Nara Lokesh as he flags off 'Yuvagalam' Padayatra in Kuppam. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం చిత్తూరులోని కుప్పం
By అంజి Published on 27 Jan 2023 12:10 PM IST
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం చిత్తూరులోని కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించారు. కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురంలోని శ్రీవరదరాజస్వామి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 11.03 గంటలకు ఆలయం నుంచి తొలి అడుగు వేసి యాత్ర ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు.. లోకేష్ వెంట నడుస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరుగుతూ క్షేత్ర స్థాయిలో ప్రజల పరిస్థితులు తెలుసుకోనున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర కొనసాగనుంది. యువగళం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.
శుక్రవారం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్రకు మద్ధతు తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్తూరులోని కుప్పంకు తరలివచ్చారు. యువగళం పాదయాత్రతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు స్వస్తి పలకడంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు లోకేష్. నారా లోకేష్‌కు మద్దతుగా కుప్పంలో వేలాది మంది పార్టీ శ్రేణులు తరలివచ్చారు. హోటళ్లు, లాడ్జీలన్నీ పార్టీ కార్యకర్తలతో నిండిపోగా ఎక్కడ చూసినా టీడీపీ జెండాలు, బెలూన్లు, బ్యానర్లు కనిపించడంతో కుప్పం పసుపుమయంగా మారింది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం పరిధిలోని కమతమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు 50 వేల మంది తరలివస్తారని అంచనా. వేదికపై 300 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. 400 మంది వాలంటీర్లను, 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించారు. లోకేష్ పాదయాత్రలోనూ 400 మంది వాలంటీర్లు ఉండనున్నారు. పాదయాత్ర జరిగే 400 రోజులు కాన్వాయ్‌లోనే లోకేష్ విశ్రాంతి తీసుకుంటారు.