రేషన్‌ కార్డులు ఉన్నవారికి సీఎం జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డులు ఉన్నవారికి..

By అంజి  Published on  27 Oct 2023 1:07 AM GMT
YS Jagan Govt, ration cards, APnews, ration,  Dal

రేషన్‌ కార్డులు ఉన్నవారికి సీఎం జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డులు ఉన్న వారికి కంది పప్పు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా రేషన్‌దారులకు కిలో చొప్పున కందిపప్పు అందించనుంది. దీని కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పును కొనుగోలు చేస్తోంది. ఇందుకు హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (హాకా)కు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే హాకా దగ్గర తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల కందిపప్పు సరఫరా చేస్తామని చెప్పింది. ముందుగా తొలి విడతలో 3,660 టన్నులు, రెండో విడతలో 3,540 టన్నులు అందించనున్నారు.

నవంబర్‌ నెలలో అవసరాల కోసం 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో పప్పు ధాన్యాల కొరతతో ధరలు భారీగా పెరిగాయి. దేశంలో పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లపోవడంతో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర కూడా నిల్వలు లేవు. దీంతో కందిపప్పు సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. అయితే ప్రభుత్వం కిలో కందిపప్పును రూ.67కు రేషన్ కార్డులు ఉన్నవారికి ఇవ్వనుంది. సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తుంది. ఈ నెలాఖరు నాటికి రేషన్‌ షాపుల దగ్గర అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనున్నారు.

నవంబర్‌తో పాటు డిసెంబర్, జనవరిలో కూడా సబ్సిడీ కింద కందిపప్పును ఇచ్చేందుకు సీఎం జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఇప్పటికే 50వేల టన్నుల కందిపప్పు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కర్ణాటకలోని బఫర్‌ స్టాక్‌ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లేదు. మళ్లీ రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా స్పందన లేదు. ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో కందిపప్పు విషయంలో ఇబ్బందు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్‌ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలని భావిస్తున్నారు. వీటిని సబ్సిడీపై కార్డుదారులకు అందించనున్నారు.

Next Story