అమరావతి: యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. త్వరలోనే నిరుద్యోగ యువతకు శుభవార్త రానుంది. కూటమి ప్రభుత్వం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల వారీగా వివరాలను సేకరిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యా శాఖలలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మరో వారంలో ఖాళీల తుది లెక్క తేలనుంది.
ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరిలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. రాజమండ్రిలో 'హలో లోకేష్'లో భాగంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా యువత ఉద్యోగాలు పొందేందుకు ఇబ్బందులు పడుతోందని.. ఇందుకు విద్యతో పరిశ్రమలను అనుసంధానించాలని అభిప్రాయపడ్డారు. ఐదేళ్లలో అన్ని రంగాల్లో కలిపి 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.