పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలు జరగనున్న రోజుల్లో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపింది. ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి, పరీక్ష రాసిన అనంతరం పరీక్షా కేంద్రం నుంచి ఇంటికి ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొంది. ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో పాస్‌లు లేకపోయినా విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ అన్ని జిల్లాల అధికారులకు గురువారం ఈడీ(ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇందుకు విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. కేవలం ఈ (పరీక్షలు జరిగే) రోజుల్లో మాత్రమే విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. ఈ ఏడాది 6.22లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 3,780 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు డిపోల మేనేజర్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చించి విద్యార్థులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.