అమరావతి: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగగలదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తనకు విద్యాశాఖ అవసరమా? అని చాలా మంది అన్నారని మంత్రి లోకేష్ తెలిపారు. కానీ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి సక్సెస్ అయ్యానని చెప్పారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ నెలలోనే ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది టీచర్లేనని అన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివితే జీరో ఇన్వెస్ట్‌మెంట్.. హై రిటర్న్స్ ఉంటాయన్నారు. కొన్ని స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు కూడా పెట్టారని మంత్రి లోకేష్ తెలిపారు.
''ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డీఎస్సీలో ఎంపికైన వారే. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు. సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు పడ్డాయి... కానీ డీఎస్సీ మాత్రం ఆగలేదు'' అని మంత్రి లోకేష్ తెలిపారు.
అంతకుముందు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన గురుపూజ ఉత్సవం (ఉపాధ్యాయ దినోత్సవం)లో భాగంగా మంత్రి లోకేష్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.