అమరావతి: పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయించింది. 10 శాతం వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 10 శాతం వెన్న కలిగిన పాలకు రూ.80 చెల్లిస్తుండగా, రూ.2 పెంచడంతో రూ.82కి చేరింది. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెండో విడత బోనస్‌గా రూ.12 కోట్లు నేడు విడుదల చేయనుంది.
సోమవారం పాలఫ్యాక్టరీలో జరిగిన పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశ వివరాలను యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. ఏడాదికి మూడు విడతలుగా బోనస్ ఇస్తున్నామన్నారు. ఆర్థిక లాభం లెక్కలు వేసుకుని బోనస్‌లు ప్రకటిస్తున్నామన్నారు. రైతు నుంచి తీసుకునే పాలకు లీటరుకు రూ.82 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆవు పాలకు రూ.1.55 పెంచామన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచుతున్నామన్నారు.
గ్రామీణ యువతకు డెయిరీ ఫాంపై ఆసక్తిని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. సంపాదనలో మూడు సార్లు రేటు, బోనస్ ఇచ్చేది కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమేనన్నారు. ఇప్పటికే రైతులకు బోనస్‌తో కలిపి లీటరుకు సుమారు రూ.91లు ఇస్తున్నామన్నారు. ఈ ధరను మరింతగా పెంచుతామన్నారు. వినియోగదారుడి నుంచి తీసుకున్న డబ్బుల్లో 82శాతం పాడి రైతులకు ఇస్తున్నా మన్నారు.