అమరావతి: పదో తరగతి విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్వర్తులు వెలువడ్డాయి.
సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపర్చేందుకు 100రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, ప్రిపరేషన్, పదోతరగతి పరీక్షల బ్లూప్రింట్ ప్రకారం ప్రీఫైనల్, గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ప్రణాళికలో సూచించినట్టు ఆదివారం కూడా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. మార్చి 10వ తేదీ వరకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖ పాఠశాలలను ఆదేశించింది.