భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు గోదావరిలోకి ఐదుగురు దిగగా అందులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం నుంచి మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరికి జిల్లాకు చెందిన ఓ కుటుంబం రెండు రోజుల క్రితం భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఐదుగురు స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.
వారు నీటిలో మునిగిపోతూ కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు మహిళలను రక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. మరో ముగ్గురుని రక్షించినప్పటికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులను చరణ్(10), వరలక్ష్మీ(35), సురేఖ(16)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.