రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 6:54 AM ISTరేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించింది. ఈ నెల 8 వ తేదీ ఉయదం నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర అధికారులు పూర్తి చేశారు. ఉత్తర్వుల ఫైలుపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం వెళ్లింది. సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన వెంటనే ఉచిత ఇసుక అమలుపై జీవో వెలువడనుంది. ఈ మేరకు వివరాలను గనులశాఖ వెల్లడించింది.
ఈ విధానం కింద వినియోగదారులు గనులశాఖకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా ఇసుకను పొందే అవకాశం ఉంటుంది. ఇసుకను తవ్వించి, లారీల్లో లోడ్ చేయించి, తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది. దీన్నే నిర్వహణ వ్యయం అని అంటారు. రీచ్‌లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కోలా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీ1-కేటగిరీ ఇసుక రీచ్‌లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను కూడా వినియోగదారులే భరించాలి.
డిపోల్లో ఉన్న ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకొని వచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ చార్జీలు, ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే రూ.88 ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు.ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా ఫీజు చెల్లింపులు జరిపేలా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేస్తారు. ఇసుక అవసరం ఉన్నవారు నేరుగా తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబరు వివరాలను జతచేసి డిపో ఇన్‌చార్జి వద్ద ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. గృహ నిర్మాణరంగం, ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు.