అమరావతి: మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలో ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఆదివారం నాడు రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన 'ఇది మంచి ప్రభుత్వం' ఈవెంట్‌కు మంత్రి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5 నుంచి 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు మూడు పూటలా ఆహారం అందుతుందన్నారు.
రాబోయే రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన నూతన జిల్లాలలో ప్రతి శాఖకు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నూతన జిల్లాలలో ప్రభుత్వ భవనాలు లేక ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని కొత్త జిల్లాలలో అన్ని శాఖలకు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారన్నారు.