వారంతా శ్రమ జీవులు. రెక్కాడితేగాని డొక్కాడని బత్రుకులు. పని చేసేందుకు వేరే ప్రాంతానికి వచ్చారు. అయితే.. పిడుగు వారి పాలిట మృత్యుపాశమైంది. పిడుగుపాటుకు నలుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. లింగపాలెం మండలం బోగోలులో జామాయిల్ కర్రలను నరికేందుకు మొత్తం 35 మంది కూలీలు వచ్చారు. గత మూడు రోజులుగా వారంతా అక్కడే పని చేస్తూ చిన్న గుడారాలను ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పెద్ద శబ్ధంపై చేస్తూ పిడుగు డేరాలపై పడింది. ఈ ఘటనలో కొండబాబు(35), ధర్మరాజు(20), రాజు(25), వేణు(18)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఏసు, వెంకటస్వామి, అర్జున్ లు గాయపడ్డారు.
గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కాకినాడకు చెందిన వారిగా తెలుస్తోంది. తమ తోటి పని చేస్తున్న వారు ఇక లేరని తెలిసి తోటి కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. కూలీలు మూడ్రోజులుగా ప్లాంటేషన్‌లో పనిచేస్తున్నట్లు డీఎఫ్‌వో సత్యగౌరి చెప్పారు.