త్వరలోనే నాలుగు ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు

Four APSP police battalions to be established in AP. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎచ్చెర్ల ( శ్రీకాకుళం జిల్లా ), రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా), మద్దిపాడు

By అంజి  Published on  30 Nov 2022 5:51 AM GMT
త్వరలోనే నాలుగు ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎచ్చెర్ల ( శ్రీకాకుళం జిల్లా ), రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా), మద్దిపాడు (ప్రకాశం జిల్లా), చిత్తూరులో నాలుగు కొత్త ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్‌లను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోలీసు శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 పోలీసు బెటాలియన్లు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత అవసరాల మేరకు కొత్తగా నాలుగు బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

ఇందుకు సంబంధించిన భూములను కూడా గుర్తించారు. ఎచ్చెర్లలో 80 ఎకరాలు, రాజమహేంద్రవరంలో సుమారు 30 ఎకరాలు, మద్దిపాడులో 95 ఎకరాలు, చిత్తూరులో సుమారు 50 ఎకరాలు ఎంపిక చేసింది. మద్దిపాడులోని భూమిని ఇప్పటికే ఏపీఎస్పీ శాఖకు అప్పగించారు. ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం, చిత్తూరులోని భూములు పోలీసు శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిని త్వరలో ఏపీఎస్పీ విభాగానికి అప్పగించాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. అనంతరం ఆ నాలుగు కేంద్రాల్లో బెటాలియన్ల ఏర్పాటుకు భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనను ఏపీఎస్పీ చేపడుతుంది. నాలుగు బెటాలియన్ల ఏర్పాటును ఏడాదిలోగా పూర్తి చేయాలని ఏపీఎస్పీ భావిస్తోంది.

ఒక్కో బెటాలియన్‌లో 1,007 మంది సిబ్బందితో ఏపీఎస్పీ అధికారులు, జవాన్లు ఒక కమాండెంట్, ఒక అదనపు కమాండెంట్, నలుగురు అసిస్టెంట్ కమాండెంట్లు, 10 మంది రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, 24 రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్లు, 70 మంది అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్లు, 177 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 630 కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు 26 మంది మినిస్టీరియల్ సిబ్బంది, ఒక మెడికల్ యూనిట్ (8 మంది వైద్య సిబ్బంది), 56 మంది ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఇలా మొత్తం 4,028 మందితో నాలుగు బెటాలియన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా నాలుగు పోలీసు బెటాలియన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టం కానుంది.

Next Story