సుప్రీంకోర్టులో ముగ్గురు కొత్త అదనపు సొలిసిటర్ జనరల్స్ (ASG) నియామకాలకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, సీనియర్ న్యాయవాది దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్‌లను ఈ పదవులకు నియమించారు. తదనంతరం న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ అయిన రవీంద్ర కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారని కేంద్రం అధికారికంగా వెల్లడించింది.
ఈ పదవిని దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక న్యాయపదవులలో ఒకటిగా పరిగణిస్తారు. కనకమేడల రవీంద్ర కుమార్ నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవం, నైపుణ్యంకు గుర్తింపు అని రాజకీయ, న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయ జీవితంలో మాత్రమే కాక, న్యాయరంగంలోనూ చురుకైన పాత్రను పోషించిన ఆయనకు దేశ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలిచేది.