వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడారు. ఆ పార్టీ సభ్యత్వంతో పాటు భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. జగన్ హయాంలో అవంతి పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయని, అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోరని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కాకముందే ధర్నాలు చేయడమేంటని? ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ధర్నాలు, నిరసనలు అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.