పోలీసుశాఖలో విషాదం నెలకొంది. మాజీ డీజీపీ ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయనకు గత రాత్రి ఛాతినొప్పి రాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. మార్గమధ్యంలోనే ఆయన చనిపోయారని వైద్యులు పేర్కొనట్టు సమాచారం. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
ప్రసాదరావుకు భార్య సౌమిని, కొడుకు వికాస్ ఉన్నారు. ప్రసాదరావు మరణవార్త విన్న పోలీసులు, ప్రముఖులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేయడంతో పాటు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఇదిలావుంటే.. 1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రసాదరావు. స్వస్థలం విజయవాడ. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ప్రసాదరావు.. ఏసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌గానూ సేవలు అందించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ పనిచేశారు. తను అందించిన సేవలకు గాను 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‌చార్జ్ డీజీపీగా ఆయన వ్యవహరించారు.