మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం.. వీఆర్ఎస్‌ కోసం దరఖాస్తు..!

Former CS Somesh Kumar applies for VRS, unable to find 'suitable post' in Andhra.తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 5:40 AM GMT
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సంచలన నిర్ణయం.. వీఆర్ఎస్‌ కోసం దరఖాస్తు..!

తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బ‌దిలీ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. బ‌దిలీ అయిన నెల త‌రువాత ఆయ‌న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బీహార్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన సోమేష్ కుమార్ ను రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. అయితే.. ఆయ‌న క్యాట్‌ను ఆశ్ర‌యించి తెలంగాణ‌లో కొన‌సాగారు. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు సోమేశ్‌కుమార్‌కు అనుకూలంగా క్యాట్ ఇచ్చిన ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తూ ఏపీకి వెళ్లాల‌ని ఆదేశించింది.

దీంతో సోమేశ్ కుమార్ వెంట‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లి అక్క‌డ ప్ర‌భుత్వానికి రిపోర్టు చేశారు. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌, ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో భేటీ అయ్యారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎస్ స్థాయిలో విధులు నిర్వ‌హించిన వ్య‌క్తికి ఏ స్థాయి పోస్ట్ ఇస్తారు అన్న చ‌ర్చ సాగింది. ఈ క్ర‌మంలో ఆయ‌న స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారు అన్న ప్ర‌చారం జ‌రిగినా దాన్ని ఖండించారు.

సోమేశ్ కుమార్ రిపోర్టు చేసి నెల‌రోజులు గ‌డుస్తున్నా ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ఎలాంటి పోస్టు కేటాయించ లేదు. ఎందుక‌ని ఆరా తీయ‌గా ఆస్తక్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. కొద్ది రోజుల కిందటే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు సీఎం జ‌గ‌న్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఆమోద ముద్ర వేసిన‌ట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశముంది.

ఇదిలా ఉంటే.. సోమేశ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న్ను కేసీఆర్ నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Next Story