మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తాడేపల్లిలోని ఇంటికే పరిమితమైన ఆయన తొలిసారి బయటకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రంకల్లా అక్కడికి చేరుకుంటారు.
ఈ పర్యటనలో రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. వారిని కలిసి భరోసా ఇవ్వనున్నారు. జూన్ 21 వరకు పులివెందులలోనే ఉండి, ఆరోజు సాయంత్రానికి తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు. అనంతరం ఈ నెల 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన 175 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది లోక్‌సభ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.