ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత
Former AP minister Gummadi Kuthuhalamma passes away. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఏపీ మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి
By అంజి Published on 15 Feb 2023 1:00 PM ISTగత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఏపీ మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) బుధవారం ఉదయం తిరుపతిలోని తన నివాసంలో కన్నుమూశారు. వైద్యురాలు, చిత్తూరు జెడ్పీ చైర్‌పర్సన్ అయిన కుతూహలమ్మ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2014లో టీడీపీలో చేరారు. అయితే ఏడాదిన్నర క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. కుతూహలమ్మ 1985లో వేపంజేరి (ప్రస్తుతం జిడి నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1989, 1999, 2004లో ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆమె దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2007లో ఏపీ లెజిస్లేచర్ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ఆమె స్పీకర్‌గా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
గుమ్మడి కుతూహలమ్మ 1 జూన్ 1949లో ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించింది. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పని చేసి 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు.
కూతూహలమ్మ నిర్వహించిన పదవులు ఇవే
- 1980-1983 చిత్తూర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్
- 1985-1989 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యురాలు
- 1987-1994 ,ఆంధ్రప్రదేశ్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
- 1991 - 1992 వైద్యారోగ్య శాఖ మంత్రి
- 1992-1997 ఏఐసిసి సభ్యురాలు
- 1992-1993 మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి
- 1998-2006 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు
- 1999-2003 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు
- 2001-2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిటీ సభ్యురాలు
- 24 జులై 2007 నుండి 19 మే 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్