ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
Former AP DGP Gautam Sawang appointed as APPSC chairman.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2022 6:27 AM GMTఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి సవాంగ్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సవాంగ్‌కు ఎటువంటి పోస్టింగ్ కేటాయించలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని పేర్కొంది. ఇక ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఉదయ్ భాస్కర్ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తి అయింది. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉండగా.. సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
1986 బ్యాచ్‌కు చెందిన గౌతమ్ సవాంగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. చిత్తూరు, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2003 వరకు వరంగల్ రేంజి డీఐజీగా, 2003 నుంచి 2004 వరకు స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా, 2004 – 2005 వరకు APSP డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్ డీఐజీగా పనిచేసిన సవాంగ్ 2008 నుంచి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. 2016-2018 వరకూ విజయవాడ సీపీగా, 2018 జులైలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఆగస్ట్ 3న ఏపీ డీజీపీగా బాద్యతలు చేపట్టారు. 2023 జూలై 31 వరకు సర్వీసు ఉండగా ఆకస్మాత్తుగా బదిలీ వేటు పడింది. ప్రస్తుతం ఆయన్ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.