ప్రకాశం బ్యారేజీకి ఉధృతంగా వరద.. మొదట హెచ్చరిక జారీ చేసే ఛాన్స్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఈ మధ్యాహ్నంలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అశకాశం ఉందని అధికారులు తెలిపారు.
By అంజి
ప్రకాశం బ్యారేజీకి ఉధృతంగా వరద.. మొదట హెచ్చరిక జారీ చేసే ఛాన్స్
అమరావతి: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఈ మధ్యాహ్నంలోపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అశకాశం ఉందని అధికారులు తెలిపారు. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. అది 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే ఛాన్స్ ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు/ కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రేపల్లె , వేమూరు నియోజకవర్గ కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు ఆదేశించారు.
రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేశామన్నారు. కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. కృష్ణానది పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నదిని గాని, కాలువలు గాని దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలెవరూ ఆందోళన చెందవదన్నారు. సోషల్ మీడియాలో జరిగే వదంతులను నమ్మవద్దన్నారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
అటు గోదావరి ప్రాజెక్టుల్లో భారీ వరద కొనసాగుతోంది. నిజామాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.25 లక్షల క్యూసెక్కులు ఉండగా.. నీటి నిల్వ 73.37 టీఎంసీలుగా ఉంది. అటు ఏపీలోని పోలవరం ప్రాజెక్టు 48 రేడియల్ గేట్ల ద్వారా 7,92,679 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.5 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 8.23 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.