కృష్ణా, గోదారులకు వరద టెన్షన్!

Flood threat as Godavari and Krishna in spate.వరద ప్రభావంతో గత నెలలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మళ్లీ టెన్షన్ పట్టుకుంది

By సునీల్  Published on  12 Aug 2022 7:07 AM GMT
కృష్ణా, గోదారులకు వరద టెన్షన్!
  • ఈ ఏడాది రెండోసారి వరద హెచ్చరికలు
  • ఇప్పటికే ముంపుతో అతలాకుతలం

వరద ప్రభావంతో గత నెలలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మళ్లీ టెన్షన్ పట్టుకుంది. జూలైలో భారీ వర్షాలు, వరద కారణంగా పోలవరం విలీన ముంపు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిన పరిస్థితి తెలిసిందే. పదుల సంఖ్యలో గ్రామాలను ఖాళీ చేయించి, పునరావాసం ఏర్పాటు చేసినా ఇంకా దాదాపు 40 గ్రామాలు వరదలతో ఉక్కిరి బిక్కిరయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలు వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వరద హెచ్చరిక చేయడం టెన్షన్ పెడుతోంది.

భారీ వర్షాలతో వరద నీరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక నుంచి కృష్ణా, మహారాష్ట్ర నుంచి గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గత నెలలో వచ్చిన వరద ప్రవాహానికే అన్ని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. అన్ని రిజర్వాయర్లలో జలకళ కనిపిస్తోంది. అలాగే లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలయ్యాయి. తాజాగా మరోసారి అదే పరిస్థితి ఏర్పడింది. పై నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

గేట్లు ఎత్తి దిగువకు నీరు

కృష్ణా నదిలో వరద ప్రవాహం పోటెత్తుతోంది. కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండిపోవడంతో దిగువకు భారీగా నీరు వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588 అడుగులు ఉంది. జలాశయంలో గరిష్టంగా 312.04 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం 306.1 టీఎంసీలకు నీరు చేరింది. ఈ పరిస్థితుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ వద్ద 26 గేట్లను పైకి ఎత్తేశారు. 3.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాలువలు, జల విద్యుత్ కేంద్రాల ద్వారరా మరో 40 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్దకు 4 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉండటంతో లంక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

గోదావరికి వరద ఉధృతి

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదిలో వరద ఉధృతి నెలకొంది. గంటగంటకూ పెరుగుతున్న వరద ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం కనిపిస్తోంది. భద్రాచలం వద్ద 52.5 అడుగులక నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం మరో అరడుగు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గత వరదల్లో ముంపునకు గురైన పోలవరం విలీన గ్రామాల ప్రజలు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. వరద ప్రవాహం కారణంగా భధ్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలైన చర్ల, కూనవరం, చింతూరు, వీఆర్ పురం, దుమ్ముగూడెం మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో కృష్ణా, గోదావరి పరీవాహక పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Next Story