కడప జిల్లా సున్నపురాల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 4,500 కోట్ల పెట్టుబడితో మొదటిదశ, రూ. 16350 కోట్లతో రెండో దశల పనులు చేపట్టే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలిస్తూ ప్యాకేజీ విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సున్నపురాళ్ల పల్లె పరిధిలో ఎకరా 5 లక్షల చొప్పున 1100 ఎకరాలు భూముల కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా జనవరి 2026 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం సదరు కంపెనీని నిర్దేశించింది. ఏప్రిల్ 2029 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని తెలిపింది. జనవరి 2031 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు ప్రారంభిస్తామని సదరు సంస్థ ప్రతిపాదనల్లో తెలిపింది. ఏప్రిల్ 2034 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రతిపాదించింది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సంస్థకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.