తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్‌ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్‌ ద్వారా టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.

By -  అంజి
Published on : 19 Jan 2026 6:59 AM IST

First Gadapa Darshanm, Tirumala Srivaru, TTD, Lucky Dip, Tirupati

శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్‌ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్‌ ద్వారా టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎంపికైన భక్తులు స్వామిని అతి చేరువ నుంచి దర్శించుకోవడమే కాక ఆయనకు నిర్వహించే పలు సేవల్లోనూ పాల్గొనవచ్చు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు ఎల్లుండి చివరి గడువు. లక్కీడిప్‌లో ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి వెళ్లి లాగిన్‌ అవ్వాలి. అక్కడ 'ఆన్‌లైన్‌ సర్వీస్‌' విభాగంలోకి వెళ్లి 'సేవా ఎలక్ట్రానిక్‌ డిప్‌'పై క్లిక్‌ చేయాలి. హోమ్‌ పేజీలో కూడా ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆపై మీ వివరాలు ఇవ్వాలి. ఓ టికెట్‌పై గరిష్ఠంగా ఇద్దరు భక్తులే పేరు నమోదు చేసుకోవచ్చు. అన్ని వివరాలు ఇచ్చాక చివరిలో అన్ని సేవలను ఎంపిక చేసుకోవాలి. రేపు మధ్యాహ్నం లక్కీడిప్‌ తీస్తారు.

లక్కీడిప్‌లో సులభంగా సెలెక్ట్‌ అవ్వాలంటే..

ఆన్‌లైన్‌ లక్కీడిప్‌లో పోటీ చాలా ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు దరఖాస్తు చేసుకోవడం వల్ల ఎంపికయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే తిరుమలలో నేరుగా రిజిస్టర్‌ చేసుకోవడం వల్ల మీ అదృష్టం కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆన్‌లైన్‌ కంటే ఆఫ్‌లైన్‌ విధానంలో తక్కువ మంది పోటీ పడతారు. కాబట్టి, సేవల్లో పాల్గొనే భాగ్యం త్వరగా లభిస్తుంది. తిరుమలకు వెళ్లినప్పుడు లక్కీడిప్‌ కోసం నమోదు చేసుకోవడం మంచిది.

లక్కీడిప్‌ కాకుండా శ్రీవారి మొదటి గడప దర్శనం

శ్రీవాణి ట్రస్ట్‌కు పది వేల రూపాయల విరాళం, అలాగే ఐదు వందల రూపాయల టికెట్‌ కొనుగోలు చేసే భక్తులకు బ్రేక్‌ దర్శనం లభిస్తుంది. దీని ద్వారా స్వామివారిని అతి చేరువగా దర్శించుకోవచ్చు. అలాగే ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే వీఐపీలకు, వారి సిఫార్సు లేఖలు ఉన్నవారికి కూడా ఈ భాగ్యం కలుగుతుంది. సామాన్య భక్తులకు మాత్రం లక్కీ డిప్‌ ద్వారా లభించే ఆర్జిత సేవలే మొదటి గడప దర్శనానికి ఉన్న అత్యుత్తమ, సరళమైన మార్గం.

Next Story