తొలి ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు పీవీ చలపతిరావు కన్నుమూత
First Andhra BJP president PV Chalapathi Rao passes away. విశాఖపట్నం: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ
By అంజి
విశాఖపట్నం: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు పీవీ చలపతిరావు ఆదివారం వైజాగ్ నగరంలో కన్నుమూశారు. ఆయన వయసు 87. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చలపతిరావు కుమారుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నాయకుడు, ఉత్తర ఆంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ కూడా.
చలపతి రావు 1980 నుండి 1986 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో, 1981లో, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుండి దక్షిణ భారతదేశంలో మొదటి మేయర్‌గా బిజెపి గెలుపు పొందడంలో కీలక పాత్ర పోషించారు. 1935 జూన్ 26న జన్మించిన చలపతిరావు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే ముందు న్యాయవాద వృత్తిలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. 1967-1968 విశాఖ స్టీల్ ప్లాంట్ ఆందోళనలో చురుగ్గా పాల్గొని 1969లో గోదావరి మీదుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉద్యమం నిర్వహించారు.
1970లో జనసంఘ్‌కు పూర్తిస్థాయి కార్యకర్తగా మారారని, 1972 నుంచి 1973 వరకు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారని, పలుమార్లు అరెస్టయ్యారని బీజేపీ సభ్యులు తెలిపారు. 1974లో చలపతి రావు ఉత్తర సర్కార్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి (MLC) సభ్యునిగా ఎన్నికయ్యారు.
1980లో అదే నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికై 1986లో ఏపీ శాసన మండలి రద్దయ్యే వరకు పదవిలో కొనసాగారు. విశాఖపట్నంలోని బీహెచ్‌పీవీలో కార్మికుల కోసం 1978లో 14 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన పోరాటంతో 500 మందికి పైగా కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని అధికారులను ఒత్తిడి చేసింది. ఆయన నిరంతర కృషితో ఎంఈఎస్‌లో దాదాపు 1200 మంది కార్మికులు పర్మినెంట్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా, గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు.
చలపతి రావు పార్థివ దేహాన్ని వైజాగ్ నగరంలోని ఆయన స్వగృహానికి తరలింస్తామని, అక్కడ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.