కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. ఆశ్రమం సిబ్బంది వారిని వెంటనే బయటకు తీసుకొచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు సమాచారం. చుట్టు పక్కల వారు వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఎలా చెలరేగాయనే విషయం ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.