అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో 2024 - 25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని, ముఖ్య పథకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనను ప్రజలు పాతరేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి 93 శాతం మంది ప్రజలు మద్ధతు పలికారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుభవంతో సీఎం చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
అటు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్‌ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం రూ.32,712 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.
అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం అయ్యింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపొందించిన 2024 - 25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.