AP Budget: రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్
2024 - 2025 వార్షిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389.27 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
By అంజి Published on 7 Feb 2024 12:04 PM ISTAP Budget: రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 - 2025 వార్షిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389.27 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆదాయం వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా, మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ లోటు రూ.24,758.22 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లుగా బుగ్గన ప్రకటించారు. అలాగే జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం, జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా బుగ్గన ప్రకటించారు. బడ్జెట్‌లో ఏపీని సంపన్న ఆంధ్రగా మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్, మే, జూన్, జులై నెలలకు మాత్రమే బడ్జెట్ ఆమోదం తీసుకుంటారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి బుగ్గన అన్నారు. రాష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా తమ ప్రభుత్వ చర్యలు తీసుకుందన్నారు. పాలనా విభాగాలను పునర్‌వ్యవస్థీకరించి అన్ని వర్గాల వారికీ సాధికారిత అందించామని, విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టకముందు జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ది డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనుంది. అలాగే నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇది ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.