అత్యధిక పోలింగ్‌ నమోదైన నియోకవర్గం ఇదే.. దేశంలోనే ఏపీ టాప్‌: ముకేశ్‌ కుమార్‌

ఈ సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లో నమోదు అయ్యిందని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

By అంజి  Published on  15 May 2024 2:42 PM IST
AndhraPradesh, Elections 2024,AP Poll percentage, AP CEO Mukesh kumar

అత్యధిక పోలింగ్‌ నమోదైన నియోకవర్గం ఇదే.. దేశంలోనే ఏపీ టాప్‌: ముకేశ్‌ కుమార్‌

ఈ సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్‌లో అత్యధిక ఓటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లో నమోదు అయ్యిందని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 81.86 శాతం ఓట్లు పోల్‌ అయినట్లు ఆయన వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, మిగతా ఓట్లు బ్యాలెట్‌ పేపర్ల ద్వారా పడినట్టు తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. అసెంబ్లీకి మొత్తం 3,33,50,332 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్‌ నమోద అయినట్లు ముకేశ్ కుమార్‌ తెలిపారు.

తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు. 3500 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగిందని, కొన్నిచోట్ల అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగిందని తెలిపారు. పార్లమెంట్‌కి 3,33,40,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఒంగోలులో అత్యధిక ఓటింగ్ 87.06 శాతం నమోదైంది. అత్యల్పంగా వైజాగ్‌లో 71.11 శాతం నమోదైంది. నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇదే అత్యధిక ఓటింగ్ శాతం: ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.

ఎన్నికల వేళ పోలింగ్‌ సెంటర్ల దగ్గర అల్లర్లు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఏపీ సీఈవో స్పష్టం చేశారు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్‌ అయ్యిందని, దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్ట్‌ చేశామని తెలిపారు. తాడిపత్రి, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. నాలుగు చోట్ల 144 సెక్షన్‌ విధించామన్నారు.

Next Story