ఎంత కష్టం.. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు..
Father Dies Infront Of Daughter. తాజాగా కొవిడ్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి ఓ యువతి తల్లడిల్లిపోయింది
By Medi Samrat Published on 3 May 2021 4:33 AM GMT
కరోనా కారణంగా ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోతున్నారు. తాజాగా కొవిడ్ సోకి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి ఓ యువతి తల్లడిల్లిపోయింది. తల్లి వద్దని అంటున్నా వినకుండా.. తండ్రి నిస్సాయతను చూడలేక గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. అనంతరం ఆ తండ్రి మృతిచెందాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్ల కంట కన్నీరు పెట్టిస్తుంది.
ఆదివారం నాడు ఈ హృదయవిదారక ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరి నాయుడు( 44 ) విజయవాడలో కూలి పనులు చేసుకునేవాడు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అసిరి నాయుడు కుటుంబసభ్యులు ఆదివారం స్వగ్రామానికి వచ్చేశారు.
అయితే.. గ్రామస్థులు వారిని ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. ఈలోపు అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కిందపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అయితే అతని కూతురు మాత్రం తట్టుకోలేకపోయింది. తల్లి వద్దని వారిస్తున్నా.. కన్న తండ్రి మీద ప్రేమను చంపుకోలేకపోయింది. వెళ్లి తండ్రి గొంతు తడిపింది. ఆ వెంటనే అతడు మరణించాడు. తండ్రి శవం వద్ద ఆ కూతురు ఏడుస్తున్న తీరు అందరిని కన్నీరు పెట్టిస్తుంది. హృదయవిదారకమైన ఈ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఈ వీడియో చూసినవారు పగవాడికి కూడా ఇటువంటి కష్టం రాకుడదని కోరుకుంటున్నారు.