పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్దారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.