అమరావతి: బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆదివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులు కావడం గమనార్హం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54), బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మీ (60)గా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న 13, 11 ఏళ్ల ఇద్దరు బాలురు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.