అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతుకు అదృష్టం వజ్రం రూపంలో తలుపు తట్టింది. దీంతో ఆ రైతు ఒక్క రోజులోనే కోటిశ్వరుడైపోయాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామంలోని ఓ రైతు తన పొలంలో పనిచేసుకుంటుండగా.. ఆ కూలీకి విలువైన వజ్రం దొరికింది. వేరు శనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్దం చేసే క్రమంలో కంది కొయ్యలు తీస్తుండగా రైతుకు మెరుగురాయి కంటపడింది. ఈ విషయం వజ్రాల వ్యాపారులకు తెలియడంతో అతడి ఇంటికి వెళ్లారు.
అక్కడ పోటీలో ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.1.2కోట్లకు రైతు నుంచి దాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ వజ్రం బరువు 25 క్యారెట్లు ఉంటుందని సమాచారం. కాగా.. బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.3కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత.. తనకు దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియజేయలేదని, వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న, పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతుంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతుండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తుంటారు. వ్యాపారులు వాటిని రహస్యంగా కొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోందనే వాదనలు ఉన్నాయి.