ఏపీ: రాయలసీమ ప్రాంత సంస్కృతి, నైతికతలను అదే మాండలికంలో తన కథలు, నవలల్లో వివరంగా ఆవిష్కరించిన ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి సోమవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో కన్నుమూశారు. ఆయన వయసు 84. విశ్వనాథ్ రెడ్డి రెండు రోజుల క్రితం ఒంగోలులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు.. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున విశ్వనాథ్‌రెడ్డి మృతి చెందారు. విశ్వనాథ్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు సాహిత్య రంగంలో అనేక ఇతర అవార్డులను అందుకున్నారు.
విశ్వనాథ్‌రెడ్డి ప్రసిద్ధ ఉపాధ్యాయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగసాయిపురం గ్రామానికి చెందినవారు. పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆయన డాక్టరేట్ పొందారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్‌సిఈఆర్‌టి సంపాదకుడుగా వ్యవహరించారు. వివిధ పత్రికా సంస్థల్లో ఎంతో మంది పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. విశ్వనాథ్ రెడ్డి తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది.